ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ (Mukesh Ambani), నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) వివాహ వేడుక అత్యంత ఘనంగా జరిగింది.
దేశంలోని వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథుల మధ్య రాధికా మర్చెంట్‌ను అనంత్ అంబానీ వివాహం చేసుకున్నాడు (Anant Ambani Wedding). ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా, పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడకలో జరుగుతున్న పలు కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు బయటకు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అనంత్ అంబానీ ఊబకాయం (Anant Ambani Health) గురించి చర్చ జరుగుతోంది. ఒక దశలో 108 కిలోల బరువు తగ్గిన అనంత్ మళ్లీ పూర్వపు స్థితికి చేరుకున్నాడు. యుక్త వయసులో ఉన్నప్పుడు 200 కిలోల బరువును కూడా దాటేసిన అనంత్ తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. అనంతరం కఠినమైన వ్యాయామం, డైటింగ్ చేసి 18 నెలల్లోనే 108 కిలోల బరువు తగ్గి ఔరా అనిపించాడు. అయితే చిన్నప్పటి నుంచి ఆస్తమాతో బాధపడుతున్న అనంత్ తగ్గినంత వేగంగా మళ్లీ బరువు పెరిగిపోయాడు. అనంత్ మళ్లీ బరువు పెరగడం గురించి నీతా (Nita Ambani) ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
`అనంత్ తీవ్రమైన ఆస్తమాతో బాధపడుతున్నాడు. అతడు చాలా ఎక్కువ స్థాయిలో స్టిరాయిడ్స్ వాడాల్సి వచ్చింది. ఆ స్టిరాయిడ్స్ వల్లే అనంత్ మళ్లీ బరువు పెరిగిపోయాడు` అని నీతా పేర్కొన్నారు. జామ్ నగర్‌లో జరిగిన ప్రీ-వెడ్డింగ్ వేడుకలో తన అనారోగ్య సమస్యల గురించి అనంత్ మాట్లాడాడు. `నా జీవితం పూల పాన్పు కాదు. నేను చిన్నప్పట్నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నాను. జీవితాంతం వాటితో పోరాడాల్సిందే. మా అమ్మ, నాన్న నాకు అండగా నిలుస్తూ మానసిక ధైర్యాన్ని ఇస్తున్నారు` అంటూ అనంత్ వ్యాఖ్యానించాడు. అనంత్ మాట్లాడుతున్న సమయంలో ముఖేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు.