Neeraj Chopra Marriage: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఒలింపిక్స్ మెడలిస్ట్ నోరజ్ చోప్రా.. గ్రాండ్‍గా వివాహం
భారత స్టార్ జావెలిన్ త్రోయర్, రెండు ఒలింపిక్స్ పతకాల విజేత నోరజ్ చోప్రా.. వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన పెళ్లి విషయాన్ని నేడు (జనవరి 19) సోషల్ మీడియా వేదికగా అతడు ప్రకటించాడు.
నీరజ్ పెళ్లి సమాచారం ముందుగా బయటికి రాలేదు. సడెన్‍గా ప్రకటించి సర్‌ప్రైజ్ ఇచ్చాడు నీరజ్. తన పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు. హిమానీ మోర్‌ను నీరజ్ చోప్రా వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి రెండు రోజుల కిందటే జరగగా.. నేడు వెల్లడించాడు. ఆ వివరాలివే..
ప్రేమతో ఒక్కటయ్యాం
జీవితంలో తాను కొత్త ఆధ్యాయంలోకి అడుగుపెట్టానని ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశాడు నీరజ్ చోప్రా. పెళ్లి ఫొటోలను పంచుకున్నాడు. “మమల్ని కలిపే ఈ సందర్భానికి చేర్చిన ప్రతీ ఆశీర్వాదానికి కృతజ్ఞతలు. ప్రేమతో ఒక్కటయ్యాం. ఎప్పటికీ సంతోషంగా ఉంటాం” అని క్యాప్షన్ రాశాడు. నీరజ్, హిమానీ పేర్లు రాసి మధ్యలో లవ్ సింబల్ పెట్టాడు.
విషయం బయటికి రాకుండా..
పెళ్లి విషయాన్ని ముందుగా నీరజ్ చోప్రా బయటికి చెప్పలేదు. ఎక్కడా విషయం వెల్లడి కాకుండా జాగ్రత్త పడ్డాడు. రెండు రోజుల కిందటే వివాహం జరగగా.. ఇప్పుడు ఒక్కసారిగా ఫొటోలను షేర్ చేశాడు. పెళ్లి జరిగిపోయిందని అందరినీ ఆశ్చర్యపరిచాడు. కుటుంబాల సమక్షంలో వివాహం సంప్రదాయ బద్ధంగా గ్రాండ్‍గా జరిగినట్టు ఫొటోలను చూస్తే అర్థమవుతోంది.
హనీమూన్‍కు వెళ్లారట
వివాహం చేసుకున్న తర్వాత అప్పుడే నీరజ్, హిమానీ.. హనీమూన్‍కు వెళ్లారట. ఈ విషయాన్ని నీరజ్ బంధువు భీమ్ చెప్పారని పీటీఐ పేర్కొంది. హిమానీ ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నారని తెలుస్తోంది. “ఇండియాలో రెండు రోజుల క్రితమే పెళ్లి జరిగింది. ఎక్కడ జరిగిందో నేను చెప్పలేను. పెళ్లి కూతురు.. సోనీపట్‍కు చెందిన వారు. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నారు. వారు హనీమూన్ కోసం వెళ్లారు. ఎక్కడికి వెళ్లారో తెలియదు. మేం ఈ విషయాన్ని అలాగే ఉంచాలని అనుకుంటున్నాం” అని భీమ్ చెప్పారు.
2021లో జరిగిన టోక్యో ఒలింపిక్ క్రీడల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి భారత అథ్లెట్‍గా హిస్టరీ క్రియేట్ చేశాడు. గతేడాది పారిస్ ఒలింపిక్స్ 2024 విశ్వక్రీడల్లో రజత పతకం కైవసం చేసుకున్నాడు నోరజ్ చోప్రా. రెండో ఒలింపిక్ పతకం గెలిచిన నెలల్లోనే ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. పెళ్లైన రెండు రోజులకు సడెన్‍గా ఈ విషయాన్ని వెల్లడించాడు. నీరజ్, హిమానీ ముందుగానే ప్రేమించుకున్నట్టు అతడి పోస్ట్ ద్వారా అర్థమవుతోంది.