LPG Gas Cylinder: ఇకపై ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఫ్రీ డెలివరీ.. ఆ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు
గ్యాస్ సిలెండర్ డెలివరీ పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ డీలర్లు వినియోగదారుల్ని డెలివరీ ఛార్జీల పేరుతో దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలపై ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సోమవారం (జనవరి 30) ఓ ప్రకటన విడుదల చేశారు.
తాజా నిబంధనల ప్రకారం.. గ్యాస్ ఏజెన్సీ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోపు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదు. 5 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకూ దూరానికి కేవలం రూ.20 మాత్రమే ఛార్జీలు వసూలు చేయాలి. గ్యాస్ ఏజెన్సీ నుంచి 15 కిలోమీటర్లు దాటితే మాత్రం ఒక్కో సిలెండర్‌కు రూ.30ల చొప్పున వసూలు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఇకపై ఐదు కిలోమీటర్ల లోపు ఎలాంటి అదనపు మొత్తం చెల్లించాల్సినవసరం లేకుండా.. సిలెండర్ రసీదులో ఉన్న రేటు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని రాష్ట్ర ప్రజలకు సూచించింది.
ఈ మేరకు సిలెండర్ డెలివరీ కోసం ప్రభుత్వం నిర్ణించిన నిర్ణీత రుసుము మాత్రమే వసూలు చేయాలని, అలా చేయని పక్షంలో సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్లు లేదా జిల్లా పౌరసరఫరాల అధికారి లేదా సేల్స్ అధికారికి తగు ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్ సూచించారు. ఎల్బీజీ వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1967 ద్వారా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లలో లేదా ఆయిల్ కంపెనీ టోల్ ఫ్రీ నంబర్ 1800233555కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.