Los Angeles Wildfires: లాస్ఏంజెలెస్‌లో ఆరని కార్చిచ్చు – హాలీవుడ్ స్టార్లపై ఆగ్రహం, ఎందుకో తెలుసా?
Water Shortage To Put Out The Fire In Los Angeles: లాస్ఏంజెలెస్లో (Los Angeles) కార్చిచ్చు ఉగ్రరూపం దాలుస్తోంది. తీవ్ర గాలులతో మంటలు ఓ చోటి నుంచి మరోచోటుకు వేగంగా వ్యాపిస్తున్నాయి.
మృతుల సంఖ్య 16కు చేరగా.. ఒక్క ఎటోన్ ఫైర్లోనే 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. పాలిసేడ్స్ ఫైర్ను 11 శాతం అదుపు చేయగలిగినట్లు తెలిపారు. ప్రస్తుతం కార్చిచ్చు బ్రెంట్వుడ్ వైపు మళ్లినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోనే లిబ్రోన్ జేమ్స్, ఆర్నాల్డ్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ నివాసాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె తన చివరి విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు.
హలీవుడ్ స్టార్లపై ఆగ్రహం
మరోవైపు, కార్చిచ్చును ఆర్పేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. నీటి కొరత పెను సమస్యగా మారింది. వేల ఇళ్లను మంటల బారి నుంచి రక్షించేందుకు చేస్తోన్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. ఘటన ప్రాంతంలో జలాలు ఏమాత్రం సరిపోవడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితిపై హాలీవుడ్ స్టార్లపై విమర్శలు
వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ స్టార్లు లాస్ఏంజెలెస్లోని జలాలను ఇష్టానుసారంగా దుర్వినియోగం చేయడంతో కొరత ఏర్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి తమకు కేటాయించిన నీటి కంటే కొన్ని రెట్లు అదనంగా వాడేసుకుని తమ గార్డెన్లను పెంచుతున్నారని డెయిలీ మెయిల్ ఓ కథనంలో పేర్కొంది. 2022 నుంచి లాస్ ఏంజెలెస్లోని నీటి వినియోగంపై ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. ఎవరైనా సరే తమ తోటకు నీళ్లు పెట్టాలంటే.. వారానికి రెండుసార్లు 8 నిమిషాలు మాత్రమే వాడుకోవాలని స్పష్టం చేసింది.
నటి కిమ్ కర్దాషియన్ ది ఓక్స్లోని తన 60 మిలియన్ డాలర్ల ఇంటి చుట్టూ తోటను పెంచేందుకు తనకు కేటాయించిన నీరు కంటే 2,32,000 గ్యాలెన్లను అదనంగా వాడుకొన్నట్లు అధికారులు గుర్తించారు. కండల వీరుడు సిల్వస్టెర్ స్టాలోన్, కెవిన్ హార్ట్ వంటి వారు అదనంగా నీరు వాడుకుని జరిమానాలు చెల్లించారు. కార్చిచ్చు ప్రారంభమైన ప్రదేశానికి దగ్గర్లోనే కిమ్ కర్దాషియన్ ఇల్లు ఉంది. తాజాగా ఆమె కూడా ఇంటిని ఖాళీ చేసింది. కొందరు హాలీవుడ్ స్టార్లు గంటకు 2 వేల డాలర్లు చెల్లించి.. ప్రైవేట్ ఫైర్ ఫైటర్లను నియమించుకున్నారు. ప్రస్తుతం లాస్ ఏంజెలెస్ నగరంలో దాదాపు 57 వేల ఇళ్లకు కార్చిచ్చు ముప్పు పొంచి ఉందని అంచనాలున్నాయి. పసిఫిక్ పాలిసేడ్స్లో అన్ని హైడ్రెంట్లు పని చేస్తున్నాయని డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ పేర్కొంది. కానీ, 20 శాతం హైడ్రెంట్లలో నీటి ప్రెజర్ చాలడం లేదని తెలిపింది. కొన్నిచోట్ల ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్నట్లు వెల్లడించింది.
అటు, ఈ ఘటనలో లాస్ఏంజెలెస్లోని చాలా నగరాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. 10 వేలకు పైగా భవనాలు బూడిదయ్యాయి. 1,80,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మంటలు ఇప్పటివరకు 36,000 ఎకరాల (56 చదరపు మైళ్ళు) కంటే ఎక్కువ భూమిని బూడిద చేసినట్లు తెలుస్తోంది.