ISIS: మా పిల్లలను చంపి.. మాకే తినిపించారు, అక్కడి భయానక అనుభవాలను బయటపెట్టిన మహిళ.
Hamas ఉగ్రమూకలను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయడమే లక్ష్యంగా భీకర వైమానిక దాడులకు దిగుతున్న ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ఐసిస్ చెరలో బందీగా ఉన్న ఓ ఇరాక్ యువతిని రక్షించింది.
లెబనాన్ లో ఆమెను గుర్తించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించింది. సుమారు దశాబ్దం తర్వాత ఐసిస్ ఉగ్రమూకల బందీ నుంచి విముక్తి పొందిన ఫౌజియా అమీన్ సిడో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఈ సందర్భంగా ఐసిస్ ఉగ్రవాదులు ఎంత దారుణంగా వ్యహరిస్తారనే విషయాన్ని ప్రపంచానికి చెప్పింది. బందీలకు ప్రత్యక్ష నరకం ఎలా చూపిస్తారో వివరించింది.
శిశువులను చంపి వండి పెట్టేవాళ్లు
ఐసిస్ చెరలో ఉన్న బందీలు అత్యంత ఘోరమైన పరిస్థితులను అనుభవించినట్లు సిడో వెల్లడించింది. తమ తెగకు(యజిదీ) చెందిన శిశువులను చంపి వండి పెట్టేవాళ్లని చెప్పింది. 2014లో సుమారు 200 మంది మహిళలను, పిల్లలను ఐసిస్ ఉగ్రవాదులు అపహరించి బంధించారని చెప్పింది. ఆ బందీలలో తనతో పాటు తన సోదరులు ఉన్నట్లు వెల్లడించింది. అప్పుడు తన వయసు 9 ఏండ్లు ఉన్నట్లు వివరించింది. “ఐసిస్ ఉగ్రవాదులు బందీలను అత్యంత దారుణంగా ట్రీట్ చేసే వాళ్లు. మమ్మల్ని బందీలుగా తీసుకెళ్లిన తర్వాత మూడు రోజులు తినడానికి ఏం ఇవ్వలేదు. ఆ తర్వాత అన్నం, మాంసం పెట్టారు. అది తింటున్న సమయంలో ఏదో తేడాగా అనిపించింది. తిన్నాక కొద్ది సేపటికి చాలా మంది వాంతులు చేసుకున్నారు. ఆ తర్వాత మాకు అసలు విషయం చెప్పారు. శిశువులను చంపి వండిపెట్టామన్నారు. చిన్నారులను చంపి వండుతున్నప్పుడు తీసిన ఫోటోలను మాకు చూపించారు. మీ పిల్లలను మీరే తిన్నారని చెప్పారు. ఆ సమయంలో ఓ మహిళ కనిపించకుండా పోయిన బిడ్డను గుర్తు చేసుకుని అక్కడిక్కడే చనిపోయింది” అంటూ భయానక విషయాలను వెల్లడించింది.